Tuesday, August 21, 2012

ఆకాశం

ఈ రోజు ఆకాశాన్ని చూసాను
అదే పనిగా తదేకంగా చూసాను

వంద చుక్కలు లెక్క గడదామని
మొదలు పెట్టిన వాడిని
రాలుతున్న తోక చుక్కలను చూసి
అమాంతంగా పట్టుకొవాలని
అంతులేని పరుగులెట్టాను

ఆ ఉరుకులో 
ఎన్ని నడకలు నేర్చాను
ఎన్ని ఓటములు జయించాను
ఎన్ని తపస్సులు ఫలించాను

***

ఈ రోజు ఆకాశాన్ని చూసాను
అదే పనిగా తదేకంగా చూసాను

వెలుతురిని ఆర్పేసి
చీకటిని వెలిగించి చూసాను
శబ్ధాలను నిశ్శబ్దించి
అనంతాలను శొదించాను

సప్త ఋషులను కలిసాను
పాల పుంతలను ఈదాను
అంగారకుడిని కలిసాను
అరుంధతినీ చూసాను

***

ఈ రోజు ఆకాశాన్ని చూసాను
అదే పనిగా తదేకంగా చూసాను

అకాశమే జీవితమని
అనుభందాలే గ్రహాలని
అనుభూతులే నక్షత్రాలని
నేర్చుకున్నాను

కళ్ళు మూస్తే కనిపించేదంతా
శూన్యమని కనుగొన్నాను
కళ్ళు తెరిస్తే కనబడనిది కుడా 
శ్రుష్టే అని తెలుసుకున్నాను

శాపవిముక్తిని పొందాను

***

మబ్బులు మౌనంగా దారి 
విడిచాయి
చంద్రుడు చెంపల మీద రాల కుండానే
గుండెలోకి ఇంకిపొయాడు

No comments: