Wednesday, August 22, 2012

కాల జ్ఞానం



వస్తుంది

నాగుపాములను నీటి కప్పలు నోట కరిచే రోజు
గద్దలను కోడిపిల్లలు పొడిచి చంపే రోజు
తోడేల్లని కుందేల్లు చుట్టు ముట్టే రోజు
వేటగాళ్ళ తలలను జింకలు చెట్లకి కట్టే రోజు
వస్తుంది

ఏం నమ్మ లేవా?

అణువులో అనంతాన్ని
పుక్కిటి పురాణాలను
సనాతన అధర్మాలను
ముక్కోటి అసత్యాలను
నమ్మ గలిగిన వాడివి

క్రూరమ్రుగాలను 
సాధుజంతువులు 
ముట్టడించే రోజొకటి 
నిజంగా వస్తుందంటే నమ్మవేం?

పోనీ
మనువు మర్మాంగాలు తెగి పడి
శవమయ్యే రోజు వస్తుందని

మనిషి ముందు మోకరిల్లి
రఘురాముడూ కన్నీళ్ళతో
తెలియని తప్పులను
మన్నించమనే రోజు
వస్తుందని చెప్తే
నమ్ముతావా?

నమ్మవు కదూ?
నమ్మలేవు కదూ?

***

మనువుని ఎవరన్నా దూషిస్తే
నీలో కాషాయం క్షణకాలం రెప రెపలాడినా

అంటరాని తనాన్ని అమ్మనా బుతులు తిట్టినప్పుడు
నీలొ అట్టడుగుని భ్రాహ్మనీకం ఆవగింజంతైన అలిగినా

కులకుక్కలను గుడ్డలూడదీసి కొట్టండని వాడంటే
నీలో రెడ్డి రికం, కమ్మరికం, మరేరకమైనా "తామరికం" లిప్త పాటు జివ్వుమన్నా

నీ ఆత్మలొ ఇంకా అశుద్దం వున్నట్టే

పో దాన్ని తులసి తీర్దంతోనో
నీ బుజంపై పట్టు కండువాతోనొ
నా గోచి గుడ్డతోనొ
మొలరా పరిశుభ్రం చేసుకోని 
మలినాలన్నిటిని వదిలి
మనిషిగా తిరిగి రా

అప్పుడు 

వివేకం అనేకం అయి
రక్తం ఏ వర్ణంలో నైన ఎర్రగానే వుంటుందని
స్వేదం ఏ శరిరానిదైనా శ్రమిస్తెనే వస్తుంది
కన్నీరు ఏ కంటి దైనా కల్మషం లేకుండ కారుతుందని
మరణం ఏ ఇంటి దైనా దాన్ని ముక్కలుగ చేస్తుందని
నమ్ముతావు

(అంతరాలు అంతమయి వివక్ష అస్పృష్య్యత అయ్యే రోజు రావాలని కోరుతూ)


***
నేను ఇతిహాసాలలో, ఉపనిషత్తుల్లో ప్రస్తావించబడిన మనువును చూడలేదు, వినలేదు, చదవ లేదు. నాకు తెలుసుకోవాలని కుడా లేదు.

నాకు తెలిసిన మనువు వ్యక్తి కాదు, వాడు ఒక వ్యాఘ్ర వర్ణ వ్యవస్త. ఆ వ్యవస్త బతికున్నంత కాలం మనువు బతికే వుంటాడు మానవత్వాన్ని చంపుతాడు.





No comments: