Saturday, September 1, 2012

కవిత్వమొక జూదశాల

కవిత్వమొక జూదశాల
ఎవడికి వాడే
ఆడుకునే మూడు ముక్కలాట
తెరిచే వరకు తెలియదు
నీకె నీ మనసులోని మాట


విశ్వరూపం




వాడి వయసు నాలుగేళ్ళు

..........

1) నా laptop లో spiderman ఆడుతున్నాం ఇద్దరం

లైఫ్ లేదురా
ఇంక గెలవడం కష్టం అన్నాను నేను


లేదు డాడి మనం గెలుస్తాము
కచ్చితంగ గెలుస్తాము

"నమ్మకం మీద విశ్వాసముంచు" అన్నాడు వాడు

నేను ఫక్కున నవ్వాను
తల తొక లేని వాడి మాటలకు
అంతలోనె చిత్తురువయ్యాను

నాకు వాడిలో గౌతమ బుద్దుడు కనిపించాడు


2)ఇద్దరం keyboardతొ కుస్తి పడుతున్నాం


ఈ మ్యూజిక్ వద్దు డాడి 

ఏరా ఎందుకని?


చాలా sadగా అనిపిస్తుంది డాడ్ 

అదెంట్రా?


"కష్మి* ని miss చేస్తాను" 


నా ముఖంలొ నెత్తురు చుక్క లేదు
రొమియో జూలిఎట్, సలీం అనార్కలి
దేవదాసు పారు అన్ని కధలే అనుకున్నా ఇన్ని రోజులూ


(కష్మి వాడి benchmate ఇద్దరు చదివేది LKG)


3)మొదటి సారి ఇద్దరమె వెళ్ళాం సరదాగా InOrbit షాపింగ్ మాలు కి


నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి డాడి 

100 Rs ... (ఎదొ టెండెర్ పెట్టాడని తెలిసి క్యాల్కులెటెడ్ ఆన్సరిచ్చాను)


"మమ్మికేదన్నా surprise తీసుకెల్దాం ... మనకెప్పుడూ ఇస్తుందిగా" 



మాట గొంతుకి అడ్డం పడింది నాకు
మదర్ థెరీసా కనిపించింది వాడిలో


4) రాత్రి డిన్నర్ తర్వాత

మా అవిడ आप बड़े अच्छे लग्थेहोలొ
నేను FBలొ
వాడు బొమ్మల దగ్గర


"నాకు కోపమొస్తుంది డాడి" అన్నాడు వాడు

ఎందుకురా ఒకింత ఆశ్చర్యంతొ అడిగాను నేను

మమ్మి pogo పెట్టదు
నువ్వు ఫైటింగ్ ఆట ఆడవు

"నాకు బొరింగ్ కొట్టదా మరి" 

దుఃఖం తన్నుకోస్తుంటె,
పిడికిల్లు బిగించి
పంటి బిగివున ఏడుపు అదిమి పట్టి
జీర బొయిన గొంతుతొ
కీచుగ అరిచాడు వాడు

తిరుగుబాటుని నుదిటికి కట్టుకున్న
విప్లవ వీరుడు చెగెరువ కనిపించాడు
నాకు వాడిలొ 

నాలొ స్వార్ధం కరిగి కన్నీరయ్యింది

------

అమ్మా మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రినో ?

Casanova



నేనెప్పుడూ
ప్రేమించలేదు
ప్రేమించబడనూ లేదు

నాకోసం ఎక్కడా ఒక్క వెచ్చటి కన్నీటిచుక్క నేలరాలిన దాఖలాలు లేవు
ఏ అందమైన మునివేళ్ళూ తమ డైరీలో నన్ను ఆజన్మ ఖైదుగ బంధించలేదు
ఏ మూసిన కనురెప్పలు తమ మనఃఫలకంపై నన్ను మురిపెంగా ముద్రించుకోలేదు
ఏ ఆలింగనము దేహన్నిదాటి నన్ను తమ ఆత్మతో స్పృశించిన స్మృతి లేదు

నేనెప్పుడూ ఎవరి ఊహల రాకకై కలలపట్టాలను కాలంపై పరచలేదు
ఎవరి అమోదంకోసం చిక్కటిరక్తాన్ని చిందించిన చారిత్రక ఘట్టాలు లేవు
ఎవరి స్మృతులను రాజేసి నిశీధిలో నిద్రలేనిరాత్రినై చలికాచుకున్న గుర్తులేదు
ఎవరి నిర్దాక్షిణ్య నిష్క్రమణ...ఘడియైనా నా గడియారపు బాహువులను ఆపలేదు

***

అవును నిజం..నేనెప్పుడూ ప్రేమించలేదు..ప్రేమించబడనూలేదు..
అలాగని ప్రేమంటే నాకెటువంటి అపనమ్మకమూ అనంగీకారము లేదు

ప్రయత్నించాను అదేపనిగా ఒక "నిన్ను", మరొక "తనను", మరెన్నొ "తనువులను"
వాంచించాను అతిపవిత్రంగా మనసుని, ఆత్మని....ఏ శరతులులేని శరీరాన్ని

***

వెన్నెల్లో తడుస్తూ మెత్తటిఇసుక పాదాలకు జతనైనప్పుడుకూడా
నా చూపు దిగులుమేఘాలనడుమ మౌనంగా దుఃఖించే చంద్రునిపైనే

అలలుఅలలుగా ముద్దులు పెదవులతీరంపై ఎగిసిపడుతున్నా
నా చూపు ఎందుకో సుదూరాన దారితప్పిన ఒంటరిఓడపైనే

కారులో కోరికల గేర్లుమారి లిబిడోమీటర్ గిర్రున తిరుగుతున్నప్పుడు కూడ
నా చూపు రేర్ వ్యు మిర్రర్లో రొప్పుతూ వెంటాడుతున్న జ్ఞాపకాల జాగిలాలమీదే

పబ్బులో పావురాయిరెక్కలు నన్ను గూడులోకిరమ్మని గోముగా గుంజుతున్నా
నా చూపు లేత పిడికిటిలో చలనము, రంగు లేని రబ్బరు బూర మీదే

ప్రేమని వ్యక్తీకరించడానికి స్పర్శ అవసరం
ప్రేమని అనుభూతించడానికి కూడా అదే మార్గం
కాని కేవలం స్పర్శకోసమె అయితే
ప్రేమనే అందవికారమైనముసుగు తొడగనవసరంలేదుకదా?

***

ఒక స్నేహం, ఒక స్వాంతన, ఒక సాంగత్యం, ఒక సంగమం
ఎవరి కారణాలు, వారి కుండవచ్చు.
ఎవరి నిర్వచనాలు వారు ఇచ్చుకొవచ్చు
దాహమెదైతెనేమి ఎలగోల దప్పిక తీరాలిగా

కోరుకున్న వారినెవరిని కాదనలేదు
అందుకోగలిగినంతా అందించాను
ఒకరి తర్వాత ఒకరిని, ఒకరు కుదరక పోతె మరొకరిని
ప్రేమించె గలిగే లౌక్యం లోక జ్ఞానం లేని వాడిని

నేనిక్కడే ఈ తనువుల తపొవనంలొ
నా దేహపు గుంజను పాతి నా చుట్టూ నేనే
వలయమై నిరంతరంగా పరిభ్రమిస్తున్నా
ఏ పువ్వో వచ్చి నాపై శాశ్వతంగా వాలక పోతుందా అని

***

మోహాల వేటలో,
నిస్సుగ్గు నగ్నత లాంటి చిటికెడు ప్రేమ కొసం
అనేకానెక శరీరాలను అన్వ్యేశిస్తూ
కాలి పోయి రాలి పోయిన
నా యవ్వనానికి అంకితమిస్తూ
...ఒకానొక కాసనొవాను

***

నువ్వు ప్రేమించావా? సులువైన ప్రశ్న
నిన్ను ఎవరైన నిజంగా ప్రేమించారా? నీకెప్పటికి జవాబు దొరకదు

సులువైన ప్రశ్నకి కూడ నీ దగ్గర సమాధానం లేనప్పుడు
"తొలిసారివై" ఏ దేహాన్ని తాకకు

Friday, August 31, 2012

స్వేఛ్ఛకు రెండు రెక్కలు





స్వేచ్చకు ఒక వైపే రెక్కుంటే
అది ఒంటి కాలుతోనె కుంటుతుంది
ఎప్పటికి ఎగరలేదు, ఎదగలేదు
రెండో రెక్కనీ కలుపు. సప్తసముద్రాలు దాటుతుంది.
నువ్వనుకున్నది సాధిస్తుంది.

Wednesday, August 22, 2012

మృగ రాత్రి


చీకటి చిరుతపులి చెట్లమించి దూకింది
కాలం కొండచిలువ నోరు తెరిచి కదిలింది

గాలి జాగిలాలు జోరుగా రొప్పాయి
కిటికి కీచురాళ్ళు ఆగి ఆగి అరిచాయి

గోడపైని గండుపిల్లి నీడపైకి దూకింది
భయంతోటి మిడత పిల్ల గుండె ఆగి చచ్చింది

ఊడల మర్రి తొర్రలోన ఉడత ఒకటి ఏడ్చింది
ఉరవతల స్మశానంలో పీనుగొకటి లేచింది

చెరువు పక్క గుంటనక్క ఊల పెట్టి పాడింది
నీటి లోని చేప పిల్ల గోల ఆపి చూసింది

కాలు జారి జింకపిల్ల మొసలి నోట చిక్కింది
బావి లోన కప్ప శవం బైటి కొచ్చి తేలింది

తోవ వెనుక చర్చిలోన గుబులు గంట కొట్టింది
తోట లోన గాలి వీచి పువ్వు ఒకటి రాలింది

జ్ఞాపకాల గుడ్లగూబ గుడ్లు మిటకరించింది
దేహపు గబ్బిలం చూరుకింద వణికింది

కోరికల తోడేళ్ళు గుంపులుగా కదిలాయి
కాళ రాత్రి కళ్ళల్లో కదలాడెను వింత నవ్వు

కాల జ్ఞానం



వస్తుంది

నాగుపాములను నీటి కప్పలు నోట కరిచే రోజు
గద్దలను కోడిపిల్లలు పొడిచి చంపే రోజు
తోడేల్లని కుందేల్లు చుట్టు ముట్టే రోజు
వేటగాళ్ళ తలలను జింకలు చెట్లకి కట్టే రోజు
వస్తుంది

ఏం నమ్మ లేవా?

అణువులో అనంతాన్ని
పుక్కిటి పురాణాలను
సనాతన అధర్మాలను
ముక్కోటి అసత్యాలను
నమ్మ గలిగిన వాడివి

క్రూరమ్రుగాలను 
సాధుజంతువులు 
ముట్టడించే రోజొకటి 
నిజంగా వస్తుందంటే నమ్మవేం?

పోనీ
మనువు మర్మాంగాలు తెగి పడి
శవమయ్యే రోజు వస్తుందని

మనిషి ముందు మోకరిల్లి
రఘురాముడూ కన్నీళ్ళతో
తెలియని తప్పులను
మన్నించమనే రోజు
వస్తుందని చెప్తే
నమ్ముతావా?

నమ్మవు కదూ?
నమ్మలేవు కదూ?

***

మనువుని ఎవరన్నా దూషిస్తే
నీలో కాషాయం క్షణకాలం రెప రెపలాడినా

అంటరాని తనాన్ని అమ్మనా బుతులు తిట్టినప్పుడు
నీలొ అట్టడుగుని భ్రాహ్మనీకం ఆవగింజంతైన అలిగినా

కులకుక్కలను గుడ్డలూడదీసి కొట్టండని వాడంటే
నీలో రెడ్డి రికం, కమ్మరికం, మరేరకమైనా "తామరికం" లిప్త పాటు జివ్వుమన్నా

నీ ఆత్మలొ ఇంకా అశుద్దం వున్నట్టే

పో దాన్ని తులసి తీర్దంతోనో
నీ బుజంపై పట్టు కండువాతోనొ
నా గోచి గుడ్డతోనొ
మొలరా పరిశుభ్రం చేసుకోని 
మలినాలన్నిటిని వదిలి
మనిషిగా తిరిగి రా

అప్పుడు 

వివేకం అనేకం అయి
రక్తం ఏ వర్ణంలో నైన ఎర్రగానే వుంటుందని
స్వేదం ఏ శరిరానిదైనా శ్రమిస్తెనే వస్తుంది
కన్నీరు ఏ కంటి దైనా కల్మషం లేకుండ కారుతుందని
మరణం ఏ ఇంటి దైనా దాన్ని ముక్కలుగ చేస్తుందని
నమ్ముతావు

(అంతరాలు అంతమయి వివక్ష అస్పృష్య్యత అయ్యే రోజు రావాలని కోరుతూ)


***
నేను ఇతిహాసాలలో, ఉపనిషత్తుల్లో ప్రస్తావించబడిన మనువును చూడలేదు, వినలేదు, చదవ లేదు. నాకు తెలుసుకోవాలని కుడా లేదు.

నాకు తెలిసిన మనువు వ్యక్తి కాదు, వాడు ఒక వ్యాఘ్ర వర్ణ వ్యవస్త. ఆ వ్యవస్త బతికున్నంత కాలం మనువు బతికే వుంటాడు మానవత్వాన్ని చంపుతాడు.





నిశీది నినాదం



భావ కవిత్వపు ఉహా లోకపు 
స్వప్న స్కలనాలతో సంతృప్తి పడలేను 

ప్రేమ కపిత్వపు మూగ కన్నులు 
చెవిటి మనసుల కుప్పిగంతులు వెయ్యలేను 

కొట్టమ్ డి, చంపండి, నరకండి లాంటి 
విప్లవ కసి త్వం చూప లేను 

కానీ.... 

వ్యక్తి స్వేచ్చని, సమాజ స్వచ్చ తని 
ప్రేరేపించే అభ్యుదయ గీ()తాల కోసం 
అనుక్షణం అంతరంగాన్ని మధిస్తాను 
అక్షర మేధం జరిపిస్తాను 

ఎందుకంటే.... 

కవితా కాగాడాలతో 
వివేకాన్ని వెలిగించి 
సమాజాన్ని పహారా కాసే 
సాహిత్య సైనికుడిని నేను 

వేకువ రేకు వెలుగై 
రావాలంటే 
నిశ్శబ్ధ రాత్రుల నీరీక్షణలు 
నిస్సహాయ నిట్టూర్పులు 
సరిపోవు 

నిశీది నినాదాలు కావాలి 
మరో ప్రస్థానపు కంచు నగారా 
మళ్లీ మోగాలి... 

మళ్లీ మళ్లీ మోగాలి 
మొగుతూనే ఉండాలి

దాని ప్రకంపణలు 
సుశప్తావస్తలొవున్న 
భావ సారూప్య హృదయాలలో 
ఆత్మశొదన అనుకంపణలు 
సృష్టించి జాగృతం చెయ్యాలి